December 23, 2024
khairatabad-ganesh

హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ జరిగింది. ఈ పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహా గణపతి పూజ అనంతరం రేవంత్ రెడ్డి ముందుగా రాష్ట్ర ప్రజల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కార్యకలాపాలు నిర్వర్తిస్తోందన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా నిర్వహించడం గర్వకారణమన్నారు. 1954 నుంచి 2024 వరకూ దేశం దృష్టిని ఆకర్షించే విధంగా వినాయక చవితిని నిర్వహించడం ఆసక్తికర పరిణామమని రేవంత్ అన్నారు. ఖైరతాబాద్ వినాయకుడు దేశంలో గొప్ప గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు. గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం వలన సుఖసంతోషాలు, ప్రశాంతత, పాడిపంటలతో మన రాష్ట్రం ముందుకు వెళుతుందని రేవంత్ అన్నారు. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గణేశ్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను నిర్వహించిందన్నారు. సచివాలయంలో కార్యక్రమానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీని ఆహ్వానించామని తెలిపారు. హైదరాబాద్‌లో 1లక్షా40వేల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఉచిత కరెంట్ కావాలని అడిగితే భక్తుల కోసం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది అత్యధికంగా, అకాల వర్షాలతో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. దేవుని దయ వల్ల ఎక్కువ నష్టం వాటిల్లకుండా బయటపడ్డామని రేవంత్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *