గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గిరిజన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలపై ఆ శాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవరించాలని, మానవత్వాన్ని జోడించి విద్యార్థులకు మంచి నాణ్యమైన సేవలను అందించాలని కోరారు. హాస్టళ్లలో విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు జ్వరం వస్తే ఇంటికి పంపించకుండా మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. హాస్టల్ విద్యార్థులు అటవీ ప్రాంతాలకు, వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. హాస్టల్‌ను తమ సొంత ఇంటిలా విద్యార్థులు భావించేలా చూడాలని, నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు తెలిపారు. సరుకులు సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.