పూర్తి స్థాయి సోలార్ మోడల్ గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆ గ్రామంలో ఇంటింటి సర్వే ప్రారంభించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెంచాలన్న లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టుగా ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్, రెడ్కో VC & MD అనిల, సంస్థ డైరెక్టర్ కే రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఈ పైలట్ ప్రాజెక్ట్ వివరాలు తెలియజేశారు. గ్రామంలో దాదాపు 499 గృహ, 66 వాణిజ్య, 867 వ్యవసాయ, ఇతర కేటగిరీలతో కలుపుకుని మొత్తంగా 1451 వినియోగదారులు ఉన్నారు. ఇంటింటి సర్వే పూర్తి చేసిన తర్వాత గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు.